వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' ప్రారంభం
ముకుంద, కంచె చిత్రాలతో తిరుగు లేని హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్ మూడో సినిమా 'మిస్టర్' గురువారం హైదరాబాద్ లో ఆరంభమైంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - "ఎన్నో ప్రత్యేకతలున్న చిత్రం ఇది. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేస్తున్నాను. ఈ కథలో ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉంది. ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన సినిమాలకూ, ఈ సినిమాకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో యూనివర్శిటీ టాపర్ గా వరుణ్ కనిపిస్తాడు. 'ఠాగూర్' మధుగారు, బుజ్జిగారు ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యంగ్ టీమ్ తో చేస్తున్న సినిమా ఇది. తొలి షెడ్యూల్ స్పెయిన్ లోనూ, మలి షెడ్యూల్ బ్రెజిల్ లోనూ జరుపుతాం. ఆ తర్వాత ఎక్కువ శాతం షూటింగ్ ను కర్నాటక బోర్డర్ లో జరపడానికి ప్లాన్ చేశాం'' అని చెప్పారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ''మంచి టీమ్ కుదిరింది. మంచి కథతో ఈ చిత్రం చేస్తున్నాం. ఈ బేనర్ లో, శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.
కథారచయిత గోపీమోహన్ మాట్లాడుతూ - ''శ్రీను వైట్లగారితో నాకిది పదో సినిమా. వరుణ్ తేజ్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కామెడీ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, హీరోయిన్ల పాత్రలకూ అంతే ప్రాదాన్యం ఉంటుంది. సూపర్ హిట్ సాధించే చిత్రం అవుతుంది'' అని చెప్పారు.
లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ - ''ఈ స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు'' అన్నారు.
ఈ వేడుకలో నిర్మాతలు 'స్రవంతి' రవికిశోర్, 'దిల్' రాజు, భోగవల్లి ప్రసాద్, భవ్యాస్ ఆనందప్రసాద్, పరుచూరి ప్రసాద్, డా. కె. వెంకటేశ్వరరావు, హీరో రానా తదితరులు పాల్గొన్నారు.
నాజర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, పథ్వీ, సత్యం రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సిపాన, రచనా సహకారం: మధు శ్రీనివాస్, వంశీ రాజేష్, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమేరా: జె. యువరాజ్, ఎడిటింగ్: ఎమ్.ఆర్. వర్మ, ఆర్ట్: ఎ.యస్. ప్రకాశ్, స్టైలింగ్: రూపా వైట్ల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ, కో-డైరెక్టర్స్: బుజ్జి-కిరణ్, అసోసియేట్ డైరెక్టర్: సుభాష్, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.











