తెలంగాణ ఎంపీ కవిత మరియు దర్శకుడు దశరథ్ ఆవిష్కరించిన 'జీలకర్ర బెల్లం' మూవీ ఆడియో
అభిజీత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎ.శోభారాణి, ఆళ్ళ నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ''జీలకర్ర బెల్లం''. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలను తెలంగాణ ఎంపీ కవిత గురువారం ఉదయం విడుదల చేయగా సాయంత్రం హైదరాబాద్ లోని ఆవాస హోటల్ లో ఆడియో వేడుక కార్యక్రమం జరిగింది. ఈ వేడుక లో దర్శకుడు దశరథ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను దాస్య నాయక్ కు అందించారు. ఈ సందర్భంగా..
నిర్మాత ఆళ్ళ నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఉన్న యువతకు చదవు, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి. వారిని తమ తల్లితండ్రులు కూడా ప్రశ్నించలేని పరిస్థితి. ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్న వారు ఎనిమిదో అడుగు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని మంచి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. మా సినిమా ఆడియో ని విడుదల చేసి మాకు శుభాకాంక్షలు అందచేసిన గౌరవనీయులు, తెలంగాణ ఎంపీ కవిత గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజానికి ఈ సినిమాను రెండు నెలల క్రితమే విడుదల చేయాల్సింది కానీ కుదరలేదు. ఈ నెల 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని'' చెప్పారు.
దశరథ్ మాట్లాడుతూ.. ''లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాలో అభిజీత్ అధ్బుతంగా నటించాడు. స్టార్ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావాలి. అలానే తెలుగమ్మాయి రేష్మకు మంచి సక్సెస్ రావాలి'' అని చెప్పారు.
దర్శకుడు విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రీతిలో చిత్రీకరించాం. వందేమాతరం శ్రీనివాస్ గారితో నా మొదటి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. సినిమా సక్సెస్ ను సాధించి నిర్మాతలకు లాభాలు తీసుకురావాలి'' అని చెప్పారు.
అభిజీత్ మాట్లాడుతూ.. ''లవ్ వర్సెస్ ఈగో అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మధ్య ప్రేమ గెలుస్తుందా..? లేక ఈగో గెలుస్తుందా..? అనే అంశాలతో ఈ సినిమా నడుస్తుంటుంది. ప్రేమ అనేది గిన్నెడు పాలైతే.. విషం చిన్న చుక్క లాంటిది. ఆ చుక్క పాలల్లో కలవకుండా చూసుకోవాలి. ఈ సినిమా నా కెరీర్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
రేష్మ మాట్లాడుతూ.. ''సొసైటీలో మంచి మార్పు రావాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా. మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది. అభిజీత్ డెడికేషన్ తో వర్క్ చేస్తాడు. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు రావాలి'' అని చెప్పారు.
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. పాటలు వినడానికి ఎంత బావున్నాయో.. స్క్రీన్ మీద చూడడానికి ఇంకా బావుంటాయని'' చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గుణ్ణం గంగరాజు, వెనిగళ్ళ రాంబాబు, రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, బలరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అభిజీత్, రేష్మ, సుహాసిని మణిరత్నం, రఘుబాబు, తాగుబోతు రమేష్, సూర్య, ఉత్తేజ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి...స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కొమ్మనాపల్లి గణపతి రావు, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, పాటలు: రామ్ కిరణ్, కరుణాకర్, వెనిగళ్ళ రాంబాబు, వెంకట్రావు కొంపెల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. శ్రీనివాస్, నిర్మాతలు: ఎ.శోభారాణి, ఆళ్ళ నౌరోజీ రెడ్డి, దర్శకత్వం: విజయ్ శ్రీనివాస్.

























