నేషనల్ అవార్డ్ ప్రైజ్ మనీని బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు అందజేసిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురమ్ వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం కంచె. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా గెలుపొందింది. ఈ అవార్డును మే 3న దర్శకుడు క్రిష్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డుతో వచ్చిన డబ్బును క్రిష్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు ఆర్ధిక సాయంగా అందించారు.
గతంలో కూడా ఇదే విధంగా తన పెద్ద మనసుని చాటుకున్నారు. గుంటూరు జిల్లా వినుగొండ దగ్గర కుంచెర్ల గ్రామం. ఈ గ్రామంలో ప్రాథమిక వైద్యశాల సదుపాయం లేదు, ఎవరైనా ఓ ఎకరం భూమిని ఇస్తే హాస్పిటల్ కడతామని ప్రభుత్వం తెలియజేసినప్పుడు క్రిష్ తన పేర ఉన్న ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రభుత్వం క్రిష్ తాతయ్య జాగర్లమూడి రమణయ్య చౌదరి, సీతారామమ్మ పేరిట నెలకొల్పిన ప్రభుత్వాసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అదే తరహాలో ఇప్పుడు తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా క్రిష్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు అందజేయడం గమనార్హం. తన తల్లితో పాటు పలువురు వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్న బసవతారం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ఈ డబ్బును ఇవ్వడం సంతోషంగా ఉందని క్రిష్ తెలియజేశారు.