టి.వి.పి.సి. అవార్డులు
టెలివిజన్, రేడియో, పత్రికా రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ముగ్గురికి గత ఏడాది నుంచి అవార్డులు ఇస్తోంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది బుర్రె భీమయ్య స్మారక అవార్డును ప్రముఖ రచయిత, రేడియో జర్నలిస్ట్, 'పంతులమ్మ' చిత్రానికి సంభాషణలందించిన శ్రీ దివి వెంకట్రామయ్యకు, అగస్త్యశాస్త్రి స్మారక అవార్డును దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, కెమెరామెన్ జి.ఆర్.ప్రభుకు, ఎల్.కె.శ్రీధర్ స్మారక అవార్డును కెమెరామెన్ సి.సురేంద్రకు అందజేస్తున్నట్టు నిర్మాతల మండలి అధ్యక్షుడు, దర్శకనిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. టెలివిజన్ నిర్మాతల మండలి సామాజిక సేవలందించడంలో ఎప్పుడూ ముందుంటుందని, గతంలో తుపాను బాధితుల సహాయార్థం మూడు లక్షల విలువ చేసే దుప్పట్లు, ఉలెన్ రగ్గులు, చీరలు పంపిణీ చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ అవార్డుల ఫంక్షన్ ఏప్రిల్ 22వ తేదీన ప్రెస్‌క్లబ్, సోమాజీగూడలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్, తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ శ్రీ అల్లం నారాయణ విచ్చేయుచున్నారు.