22న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ప్రారంభం

Hyderabad: Nandamuri Bala Krishna's100 GautamiPutra Satakarni Movie Announcement. (Photo: IANS)
అఖండ భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రను నందమూరి బాలకృష్ణ తన నూరవ చిత్రంలో పోషించబోతున్న సంగతి తెలిసిందే. మహానటుడు, నటరత్న ఎన్టీయార్ పోషించాలనుకున్న ఈ పాత్రను ఆయన సమయాభావం కారణంగా కార్యరూపంలోకి తీసుకు రాలేకపోయారు. ఇప్పుడు తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ ను నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రంగా చేస్తుండం విశేషం. ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి బాలకృష్ణ ప్రకటించారు. ఈ నెల 22న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 'గౌతమీ పుత్ర శాతకర్ణ' ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుండి కూడా వేలాదిగా బాలకృష్ణ అభిమానులు ఈ ప్రారంభోత్సవానికి తరలి రాబోతున్నారు.
ఈ నాటి అఖండ భారతదేశానికి ఆనాడే అంకురార్పణ చేసిన రారాజు గౌతమీ పుత్ర శాతకర్ణి. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితాన్ని తెలుసుకుంటే రోమాంచితమవుతుంది. కృష్ణానదీ తీరాన అమరావతిని, గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాల పల్లిని, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ప్రతిష్ఠాన పురం ను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ అచ్చతెలుగు చారిత్రక వీరుని జీవితాన్ని బాలకృష్ణ వందవ చిత్రంగా చేస్తున్నారనే వార్త వెలువడగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను సినిమా ప్రారంభోత్సవాన తెలియచేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. సో... నందమూరి వంశాభిమానులు మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.