టీఎఫ్ టీడీడీఏ నూతన భవన ప్రారంభోత్సవం.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరక్టర్స్ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ టీడీడీఏ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యువ నాయకులు నవీన్ యాదవ్, సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు కొమర వెంకటేష్, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ, మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సీనియర్ నృత్య దర్శకులు శివశంకర్ మాస్టర్, స్వర్ణ మాస్టర్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నూతన భవన ప్రారంభోత్సవం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ...ఐకమత్యమే కార్మికుల బలం. సినిమా మీద ఇష్టంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నారు. ఇంతే సహనం ఒక సంఘంలో ఉన్నప్పుడు చూపించాలి. సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సినీ కార్మికులకు సహకారం అందిస్తోంది. ఎనిమిది నెలల్లో నూతన భవనం నిర్మించుకున్న డాన్సర్స్ సంఘానికి నా శుభాకాంక్షలు. నా వంతుగా ఐదు లక్షల రూపాయలు అందజేశాను. త్వరలో శంకరపల్లిలో 25 ఎకరాల స్థలం మీ కార్మికులకు ఇవ్వబోతున్నాం. పరిశ్రమను నమ్ముకున్న మీరంతా జీవితాల్లో స్థిరపడాలి. నూతన భవన నిర్మాణంలో అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కృషి ఎంతో ఉంది. మీలో ఒకరిగా ఉంటూ మనం సైతం అనే సంస్థను నడుపుతున్న కాదంబరి కిరణ్ అభినందనీయుడు. ఆయన తన సంస్థ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్నారు.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరక్టర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో తెలుసు. కానీ ఓ సంఘానికి భవనం నిర్మించడం ఇంకా చాలా కష్టం. ఆ కష్టాన్ని నేను అనుభవించాను. ఇవాళ మనం సుఖంగా ఉన్నామంటే కారణం మన ముందున్న సభ్యులు పడిన కష్టమే. వాళ్ల ఆలోచన, ముందు చూపు ఫలితంగానే ఇవాళ మనం భవనం నిర్మించుకున్నాం. వాళ్లు పడిన కష్టాలు ఇప్పటితరం సభ్యులకు తెలియవు. భవన నిర్మాణంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అవన్నీ తట్టుకుని నిర్మాణం పూర్తి చేశాం. కొద్ది రోజుల్లో మన సభ్యులకు సొంత ఇంటి స్థలం సమకూర్చుకుంటున్నాం. మంత్రి తలసాని గారు, ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోంది. అన్నారు.
మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...నా సోదరులైన డాన్సర్ల పాతికేళ్ల కల ఇవాళ నెరవేరింది. మరే చిత్ర పరిశ్రమకు తీసిపోని విధంగా గొప్ప భవనం నిర్మించుకున్నారు. సంఘంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. నాకు నేరుగా టీఎఫ్ టీడీడీఏతో సంబంధం లేకున్నా అనేకసార్లు మంత్రి గారితో ఈ సంఘ సమస్యలు చర్చించాను. మీలో ఒకరిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అన్నారు.
The post TFTDDA New Building Inaugurated By Talasani Srinivas Yadav appeared first on Social News XYZ.